January 21, 2017

గౌతమిపుత్ర శాతకర్ణి!


గమనిక: నేను ఏ హీరో అభిమానిని కాదు. ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, ఈ పోస్టు వ్రాయటంలో బాలకృష్ణ అభిమానిగా ఏమన్నా పక్షపాత వైఖిరి చూపించాను అని మీరు అనుకుంటారేమో అని...ఇది రివ్యూ కూడా కాదు. నేను చూసాను. మీరు కూడా తప్పక చూడండి. ఎందుకు చూడమంటున్నానో చెప్పే ఒక చిన్ని ప్రయత్నం.
గౌతమి పుత్ర శాతకర్ణి. క్రిష్ సినిమా అనగానే ఒక లాంటి ఆదుర్దా. క్రిష్ కి ఎందుకు అభిమానినో రెండు ముక్కల్లో చెబుతాను. ఒకటి, తాను సెన్సిబుల్ డైరెక్టర్. రెండోది, తన సినిమాలు ఒక మూస పద్ధతిలో ఉండవు. దానివల్ల ఎలా ఐనా ఈ సినిమా చూసి తీరాలిసిందే అనుకున్నాను. అందులోను ఒక చారిత్రాత్మక చిత్రం. నేను ఏదన్నా సినిమా చూడాలి అనుకుంటే మాత్రం దాని రివ్యూలు చదవటం, హిట్టా, ప్లాపా, కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఇలాంటివన్నీ పక్కన పెట్టి చూసేస్తాను. ఎందుకంటే, జడ్జిమెంట్ అనేది మన మైండ్ లోకి వస్తే, మనం ఆ సినిమాని ఆ కోణం నుండే చూస్తాము కానీ, సరిగ్గా ఆనందించలేము, అభినందించలేము.
ఈ సినిమా చూసిన తరువాత ఒక హైలో ఉంటాను, ఆ హైలో నుండి బయటకి రావటానికి చాలా సమయం పడుతుంది అనుకున్నాను. కానీ అనుకున్నంత రాలేదు. కారణం నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళటమే. అది వేరే విషయం అనుకోండి. దాన్ని పక్కన పెడితే, ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడండి. ఎప్పటి చరిత్ర అండి ఇది? రెండు వేల సంవత్సరాల క్రితంది. మన చరిత్ర పుస్తకాల్లో కానీ, పాఠ్యాంశాల్లో గాని దీని గురించి ఎక్కువ చెప్పబడలేదు. అలాంటిదాన్ని ఒక చలనచిత్రంగా తీయాలంటే ఎంత కష్ట తరమైన పనో ఒక్కసారి ఆలోచించారా? అదీ 79 రోజుల్లో? కానీ, అతను చేసి చూపించాడు. హ్యాట్స్ ఆఫ్ టు క్రిష్!
సినిమాలో అన్నిటికన్నా నాకు నచ్చింది, సంభాషణలు. ఎంతో అద్భుతంగా రాసారు సాయి మాధవ్ బుర్రా. వొళ్ళు పులకించి పోయింది అంటే అతిశయోక్తి కాదు. బాలకృష్ణ ఒక్కో డైలాగ్ చెబుతుంటే ఆలా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఏ మాట కా మాటే. అలా డైలాగులు చెప్పడం అందరికి రాదు. ఆ భావ వ్యక్తీకరణ ఆయన ఒక్కరికే సొంతం. ఇప్పుడు ఉన్న హీరోల్లో బాలకృష్ణ తప్ప ఇంక ఎవరు ఆ పాత్రకి  సరిరారు. ఆయన లోని ఠీవి, దర్పం, ఆ రాజసం.. అక్షరాలా ఆ శాతకర్ణి మహారాజు మన ముందు ప్రత్యక్షం అయ్యారా అనిపించేలా అబ్బుర పరిచారు. మచ్చుక్కి: "బడుగు జాతి కాదు, తెలుగు జాతి. అధములం కాదు, ప్రధములం. ఈ విశాల దేశాన్ని భుజాలపై మోస్తున్న పునాదులం. వీరులం. వేద భూమి వేరులం." ఈ డైలాగు ఎంత బాగా చెప్పారు అంటే మిగతా డైలాగులకి అన్యాయం చేసినట్లే. ఒకటా రెండా...ప్రతీ మాట ఒక మంచు కడిగిన ముత్యం లాగా వుంది. అలాంటి ముత్యాల సమాహారాన్ని మనకి అందించారు శాతకర్ణి బృందం. ఆయన మీద మీకు ఉన్న దురాభిప్రాయాలు అన్ని పక్కన పెట్టి చూసి రండి. తెలుగు భాష అంటే మక్కువ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన చిత్రం. లేకపోయినా వినండి. భాష మీద ప్రేమ పుడుతుంది.
ఇంక మిగతా పాత్రల గురించి క్లుప్తంగా చెబుతాను. వాశిష్టిగా శ్రీయ చాలా అందంగా వుంది. నాజూకుగా, సుకుమారిలా, ఒక రాణిలా మనం ఒక కొత్త శ్రీయని చూస్తాము. చిన్న చిన్న భావాలూ ఎంతో అద్భుతంగా పలికించింది. తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. రాజ మాతగా హేమ మాలిని హుందాగా అనిపించారు. ఎవరికి వారే ధీటుగా నటించారు. పాటలు చక్కగా మాటలు వినబడేలా వినసొంపుగా ఉన్నాయి. కంచె సినిమాలో, "అటు ఇటు....." పాట విన్నాక, చిరంతన్ భట్ కి అభిమాని అయ్యిపోయాను. చాలా రోజుల తరువాత బాలు స్వరం వినిపించింది. సిరివెన్నెల గారి గురించి చెప్పే అంత దాన్ని కాదు. విన్న మీకే తెలుస్తుంది. ఆయన అంటే నాకు అభిమానం కాదు, ఆరాధన. సో.....
అన్ని సినిమాల్లాగే ఈ సినిమాకి కూడా ఇన్ని ప్లస్ పాయింటులతో, చిన్న చిన్న మైనెస్లు ఉన్నాయి. అవి చెప్పి నేను అభిమానులని హర్ట్ చేయదల్చు కోలేదు.:) యుద్ధ నేపథ్యంలో జరిగిన కథ కాబట్టి యుద్ధం ఎక్కువగా చూపబడింది.
సినిమా చూసాక, దీని కన్నా బాహుబలి బావుందే అని అనుకోవద్దు. బాహుబలి ఒక కల్పితమైన కథ. అది ఒక దృశ్య కావ్యం. రాజమౌళి ఒక అద్భుతాన్ని సృష్టించి తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళారు. అందరూ అలా తీసుకెళ్ళలేక పోయినా, క్రిష్ తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. ఇది చరిత్ర. మన తెలుగు వారి చరిత్ర. అందరూ తెలుసుకోవలసిన మన కథ.
ఏదన్నా మసాలా,  వెకిలి హాస్యం, చిందులు  కావాలంటే మాత్రం ఈ సినిమాలో దొరకవు. :)
చివరిగా ఒక చిన్న మాట. ఒక సినిమా తీయాలంటే, కోట్లాది రూపాయిల ఖర్చు, సంవత్సరాల తరబడి ఆలోచనలు, నెలలు తరబడి నిద్ర లేని రాత్రుళ్ళు, పగళ్ళు , వందలమంది జనాల సహాయ సహకారాలు కావలి. అలాంటిది మనం అర ఘంట వెతికి ఆన్లైన్లో చూసేస్తే ఏమి బావుంటుంది చెప్పండి? ఎంతో కాదు. ఒక బిర్యానీ కానీ పిజ్జా కానీ తిన్నంత కూడా అవ్వదు :) లాస్ట్ బట్ నాట్ లీస్ట్, "అమ్మో... బాలకృష్ణ సినిమానా అనుకునే వారందరు, ఆహా! బాలకృష్ణ సినిమా బావుంది" అని అంటారు.

ఇట్లు మీ ,
లక్ష్మీ పుత్రిక పృథ్వీ లత 

0 comments:

Post a Comment