April 11, 2020

3. రేఖ చిత్ర పాఠశాల, పుస్తకాల్లో నెమలీకలు...

మా ఇల్లు మెయిన్ రోడ్ మీద ఉండేది. అదే రోడ్లో ఇంకొంచెం ముందికి వెళితే, రేఖ చిత్ర పాఠశాల. మనకేదో కొద్దిగా బొమ్మలు వేయటం ఇంటరెస్ట్ అని మా పిన్ని వెళ్ళి కనుక్కోమంది. పదేళ్ళ పిల్లని. నేనేమని వెళ్ళి అడుగుతా. ఎంత నసిగినా వినదే. బిక్కు బిక్కు మనుకుంటూ  వెళ్ళి అడిగా. హరీష్ సర్ అయన పేరు. ఆయన అన్నారు, "ఇంత చిన్న పిల్లలకి నేర్పించను. కనీసం ఏడో తరగతిలో అన్నా ఉండాలని." ముక్క వచ్చి ఇంట్లో కక్కానుఈవిడ వదలదే నన్ను. అయినా పర్లేదు. వెళ్ళి కన్విన్స్ చెయ్యి. నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టమండి. ఎలా ఐనా నేర్పించండి అని బతిమాలాడమంటుంది. ఏడవలేక, ఎదురు చెప్పలేక, నాలో నేనే గొణుక్కుంటూనా కర్మని తిట్టుకుంటూ మళ్ళా వెళ్ళా. నేను డ్రాయింగ్ ఎక్జామ్ రాయనండి సెవెంత్ వచ్చే దాకా. అయినా పర్లేదు నేర్పిస్తారా అని అడిగాను. నా బేల మొహం చూసో, లేక పాపం పిల్లకి ఇంత  శ్రద్ధ వుంది అని కాదనలేకనో తేలీదు కానీ, ఆయన నేర్పించటానికి ఒప్పుకున్నారు.
     ఇవాళ రోజున ఏదన్నా ఒక గీత తిన్నగా గీయగలుగుతున్నా, ఒక ముగ్గు వేయటం వచ్చినా, అది ఆయన చలవే. పెన్సిల్ చెక్కటం ఒక కళ అనేది అక్కడే నేర్చుకున్నాను. అప్పటికే షార్పనర్లు వచ్చినా, పెన్సిల్ కి ఉన్న ఒక్కో కోణం మీద చెక్కుతూ వెళ్ళాలని, కావలిసినంతనే పదును పెట్టుకోవాలని తెలుసుకున్నాను. పెన్సిళ్ళలో HB, 2HB - 8HB నుండి 9H దాకా షేడ్ లు వుంటాయని, వాటితో లెక్కలేనన్ని మ్యాజిక్కులు చేయొచ్చని...డ్రాయింగ్ అంటే, బ్రష్ పట్టుకుని రంగుల్ని పులమడం కాదు, ఎగుడు దిగుడుగా స్కెచ్ పెన్నులతో బరకటం కాదు అని అర్ధం చేసుకున్నదీ అక్కడే. ఒక సంవత్సరం పాటు నాతో నిలువు, అడ్డం, ఏటవాలుగా గీతలు, అర్ధ చంద్రాకారాలు తప్ప ఆయన ఒక్క బొమ్మ వేయించలేదుఇప్పటి వరకు అలాంటి బేసిక్స్ నేర్పించే డ్రాయింగ్ టీచర్ తారసపడలేదు. మా ఇద్దరి పిల్లలకి వెతికాను. దొరకలేదు. బహుశా దొరకరు కూడా.  I owe you, Harish Sir.    
           పెన్సిళ్ళు అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు పిల్లల్లాగా మాకు  వందల కొద్దీ  పెన్సిళ్ళు, డజన్ల కొద్దీ  ఇరేసర్లు ఉండేవి కాదు. చెరొకటి ఇచ్చే వారు. కానీ వారం తిరగకముందే మా చెల్లి పెన్సిలు అరిగిపోయేది. ఇంట్లో వాళ్ళకి అర్ధం అయ్యేది కాదు. ఎంత అడిగినా రహస్యం చెప్పము కదా. ఇంతకీ రహస్యం ఏమిటంటే, పెన్సిలు చెక్కిన పొట్టుని పుస్తకంలో దాచి పెడితే, నెమలి పించాలు పుడతాయని ఎవడో చెబితే, మనం దాన్ని అనుసరణలో పెడితే, ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయి, నాలుగు తన్ని, మరుసటి రోజు నుండి పెన్సిలు కొలిచి పంపేవారు. ఎంత మంది అలా పెట్టారో నిజం చెప్పండి.
          ఇంతలో మా చెల్లిని కూచిపూడి డాన్సులో చేరిపించారు. చిన్న పిల్ల కిన్నెరసాని థియేటర్ దాకా ఒక్కతే నడుచుకుంటూ  వెళ్ళి వచ్చేది. తనకి దగ్గరగా ఉంటుంది అని గుట్టల బజార్లో ఉషోదయ జూనియర్ కాలేజికి ఎదురుగా మల్లేశం మేస్త్రి గారి మూడు గదులు ఉన్న పెద్ద పోర్షన్ లోకి  మారిపోయాము. మరిన్ని జ్ఞాపకాలతో, మరలా వస్తా....

0 comments:

Post a Comment