March 25, 2012

తెలుగు ఉగాది

ఉగాది - 2 

తెలుగు ఉగాది ఏమిటి? ఎక్కడన్నా తమిళ ఉగాది, హిందీ ఉగాది, పంజాబి ఉగాది ఉంటాయా? ఉగాది ఉంటుంది కానీ  అనుకుంటున్నారా? హ్మ్మ్..అవును మరి, నేను చెప్పబొయేది తెలుగు ఉగాది గురించే నండి. ఆదిగో మళ్ళా తెలుగు ఉగాది…వస్తున్న..పాయింట్ కొస్తున్నా.
                  గత సంచికలో మా వూరిలో ఉగాది తగాదా గురించి మాట్లాడుకున్నాం కదా. ఎవరు ఐతేనేమి మనకి పండగ ముఖ్యం అని మా రత్నంతో నాలుగు తెలుగు ముక్కలు పలికిద్దాం అనుకున్నాక ఆ ప్రయత్నాలు మొదలు పెట్టాను.
ఏమి చెప్పించాలి అబ్బ వాడితో? సరే ఏదన్న పాట నేర్పిద్దాం అని సుళువైన పాటల కోసం వేట మొదలెట్టా. అలా
వెతికి వెతికి "గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి" కి సెటిల్ అయ్యాము. యు ట్యూబ్ లో చూస్తూ మా వాడు ప్రాక్టీసు మొదలు పెట్టాడు. అసలే తెలుగు మాట్లాడటం బొత్తిగా మానెశాడాయె. 'ళ' పలకదు.'ళ' వీడికేంటి? పెద్ద పెద్ద సినిమా హీరోలకే పలకదు. వెధవలకి, 'ళ', 'ణ' పలకటం రాదు కాని ఒక్కోడు స్టైలిష్ స్టార్, చింపే స్టార్, చినిగే స్టారును. వాళ్ళ సినిమాలు చూస్తున్నందుకు, ఆ తెలుగు వినే కర్మ పట్టినందుకు నన్ను నేనే తిట్టుకుంటూ వుంటాను. నేనేదో పెద్ద పండితురాలిని అనటల్లేదు కాని అలా కొన్ని పదాల ఉఛ్ఛారణ వింటుంటే వొళ్ళు మండుద్ది.
ఎలాగైతేనేమి, మా వాడు కష్టపడి ఒక చరణం నేర్చుకుంటున్నాడు. అంతలోకి, ఎందుకో సందేహం వచ్చి నేను మా కొలీగ్ ని (తను ఆ సంఘంలో కోర్ మెంబెర్) సంప్రదించా. ఏమండి, ఇలా సినిమా పాట పాడొచ్చా అని? ఆవిడ 'నో' అనేశారు. మళ్ళా ఏదో నా తుత్తి కోసం అన్నట్లు కనుక్కుని మరీ 'నో' చెప్పారు. ఇప్పుడేమి చేయాలి? మళ్ళా ఏమి నేర్పించాలిరా నయానా అనుకుంటూ ఆలోచిస్తున్నా...
సడెన్ గా వేమన పద్యాలూ కాని సుమతి పద్యాలూ కాని నేర్పించవచ్చు కదా అనుకున్నా. అనుకున్నదే తడువుగా వెతకనారంభించా. మచ్చుకకి ఒకటి చెప్పిద్దాం అని " ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు" మొదలు పెట్టాకా, మా వాడు చెప్పే స్టైల్, వాడి యాస చూసి నాకు భయమేసింది. ఒరేయ్ నాయన, ఉప్పు బదులు కప్పు అనో, కప్పు బదులు ఉప్పు అనో అన్నావే అనుకో, నీకు తెలుగు నేర్పిన వెధవ ఎవడ్రా? అని న్యాయ నిర్ణేతలు బండ బూతులు తిట్టటం ఖాయం అని ఖరారైంది.
                      వాడు చాలా చిన్నపిల్లాడు అప్పడే చిన్న చిన్న శ్లోకాలు అవీ చక్కగా చెప్పేవాడు. సరే, ఆ టాలెంట్ ఎమన్నా ఇంకా మిగిలుందో లేదో చూద్దాంమని "లింగాష్టకం చెబుతావా నాన్న?" అని అడిగా. హ్మం...ఇట్'స్ టూ హార్డ్ అమ్మ' అన్నాడు వాడు. ఏమిటో వీడి హార్డ్ గోల అనుకుని, బుజ్జగింజి, వాడి మీద నాలుగు భారీ డైలాగులు సంధించి,  (అరేయ్, నువ్వు గనక చెబితే అందరూ ఎంత మెచ్చుకుంటారో తెలుసా? నాకు ఎంత గొప్పగా ఉంటుంది చెప్పు? మా వాడిని కొంచెం మెచ్చుకుంటే రెచ్చిపోతడెమో అని ఈ పిచ్చి తల్లి ఆశ లెండి). పాపం వాడికి కూడా ఏదో ఒకటి చేసి వాడి ప్రతిభ చూపించాలి, నన్ను గర్వ పడేలా చేయాలి అన్న బుజ్జి కోరిక ఒకటుంది అనుకుంట. నానా తంటాలు పడి లింగాష్టకం ప్రాక్టీసు మొదలు పెట్టాడు.
 రోజుకో చరణం చొప్పున నేర్చేసుకున్నాడు. మొదటి సారి అయ్యేసరికి,  కొంచెం కన్ఫ్యూస్ అవుతా ఉన్నాడు. కొన్ని వాఖ్యాల్లో మొదటి పదం అందిస్తే మటుకు పూర్తి వాఖ్యం చేప్పేస్తున్నాడు. ఆఖరులో ఉన్న మంత్రం మాత్రం కొంచెం కష్టమే అయ్యింది. అలా సాధన అయ్యి ఉగాది ఉత్సవాలకి సమాయత్తమయ్యాము. ఇంక ఉత్సవాలు ఎలా జరిగాయో, మా వాడు ఎలా చెప్పాడో రేపు చెబుతాను....

2 comments:

  1. బాగుందండీ మీ ప్రయత్నం...నా పరిస్థితి కుడా ఇదే...ఎటొచ్చి మా వాడు తమిళం తో నన్ను చావగొడుతున్నాడు.
    మీకూ, మీ బుజ్జిగాడికీ ఆల్ ది బెస్ట్..:-)

    ReplyDelete
  2. @A Homemaker's Utopia..ధన్యవాదాలు....బాగనే అయ్యింది అండీ ప్రొగ్రాము అంతా..

    ReplyDelete