November 19, 2020

నాన్న, శివుడు, మేము....

మొన్న నా ఫ్రెండ్ నాగిని వాళ్ళమ్మగారి గురించి రాసిన పోస్ట్ చదివాక, నాకు కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. నేను ఒక టైములో ఎథిస్ట్ మాదిరి గానే ఉండే దాన్ని. అమ్మ కూడా మా  చిన్నప్పటి నుండి పెద్ద పూజలు, గట్రా  చేసే టైపు కాదు. అంతెందుకు ప్రతి రోజు దీపం పెట్టే అలవాటు కూడా తనకి లేదు. నాకు ఎప్పుడు అదో తప్పు లాగా అస్సలు అనిపించేదే కాదు. అమ్మని అలా చూసి పెరగటం వల్లనో ఏమో నాకు పెద్ద భక్తి అబ్బలేదు. కానీ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వినాయక చవితి, దీపావళి మాత్రం ఇంట్లో బాగా జరుపుకునే వాళ్ళము. అదే అలవాటు కాబోలు, ఇప్పటికి ఆ ఆనవాయితీ కంటిన్యూ చేస్తాను.

నా హై స్కూల్ అయ్యాక ఖమ్మం నుండి కొత్తగూడెం మారాక, అమ్మ తన టైలరింగ్ షాప్ మానేసి  ఇంట్లో ఉండేది. నాన్న రోజు బయటకి వెళ్ళే ముందు, అమ్మని, కొద్దిగా వాకిలి ఊడ్చి ముగ్గు వేయొచ్చు కదా అంటే, వరండాలో కూర్చుని సీరియస్ గా ఈనాడు పేపర్లో ఎడిటోరియల్ పేజీలో మునిగిపోయిన అమ్మ తలెత్తి ఒక్క లుక్ ఇచ్చేది.  ఆవిడ చూపు , ఆయన విసుగు మొహం రెండు మెదడు లో అలా ఉండి  పోయాయి.

నాన్నకి ఎప్పటి నుండి అలవాటో నాకు గుర్తు లేదు కానీ శివుడుకి పూజ చేయకుండా మాత్రం బయటకి వెళ్ళే వాళ్ళు కాదు. నేను ఇంటర్లో శ్రీశైలం ఎక్స్కర్షన్ వెళ్ళినప్పుడు సరదాగా ఒక చిన్న గాజు శివలింగం తెచ్చాను. కానీ తెచ్చాక ఎవరో చెప్పారు. ఇంట్లో శివలింగం ఉంటే ప్రతి రోజు అభిషేకం  చేయాలని. అప్పటి నుండి నాకు తెలిసి తాను పోయే ముందు వరకు కచ్చితంగా చేసే ఉంటాడు.  ఆ అభిషేకం చేసే అప్పుడు మంత్రాలు ఇంటి పెంకులు అదిరిపోయే సౌండ్ లో మోగి పోయేవి.  అమ్మ తన స్టైల్లో నవ్వేది. మెల్లగా చదివినా శివుడికి వినిపిస్తుంది అని. ఎంతటి పని ఉన్న రోజు అయినా దీపాలు కడగకుండా, పూలు పెట్టకుండా, అభిషేకం చేయకుండా బయట పనులకి బయలు దేరే వాళ్ళు కాదు.

మా చుట్టుపక్కల పల్లెటూళ్ళలో పురుగుమందు చావులు తరచూ వింటూనే ఉండే వాళ్ళము. ఏ చావు వార్త వచ్చినా,  ఆ శివుడు కి నాలుగు పటిక బెల్లం పలుకులు పెట్టకుండా గేటు దాటిన గుర్తు లేదు నాకు. ప్రతి కార్తీక మాసంలో క్రమం తప్పకుండా మా పక్క ఊర్లోని శివాలయానికి  డబ్బులు, పెద్ద క్యాన్ నువ్వుల నూనె ఇచ్చే అలవాటు తనకి. ఇష్టం ఉన్నా లేకపోయినా కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించటానికి అమ్మని కూడా తీసుకుని వెళ్ళటం ఆనవాయితి.

తరువాత రోజుల్లో వ్యాపారం సరిలేక , ఇంట్లో పరిస్థితులు కష్టంగా ఉన్న రోజున కూడా అలానే నూనె ఇస్తే, అమ్మకి వచ్చిన కోపం అంతా ఇంతా కాదు. మానవ సేవే మాధవ సేవ అనేది అమ్మ ఫిలాసఫీ. చిన్నపటి నుండి అమ్మ అంతే. అలాంటి పెంపకం వల్లనో ఏమో గుడిలో $5 వేయటానికి నాకు చేయి రాదు. అదే ఎవరికన్నా ఎమన్నా అయింది అని తెలిస్తే, గో ఫండ్ మి కి $25 ఇవ్వటానికి వెనుకాడను.

ఒక పదిహేను సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ నొక్కితే, కొన్ని స్వయం కృతాపరాధాల వల్ల ఛిద్రం  ఐన ఆయన జీవితం చివరికి ఎలా ముగుస్తుందో, ఎలాంటి చావు వస్తుందో అని మేము ఎప్పుడూ బాధ పడుతూనే ఉండే వాళ్ళము. కానీ తను ఎక్కువ బాధ పడకుండా, అనారోగ్యంతో ఎక్కువ ఇబ్బంది పడకుండా, ఆ శివయ్య త్వరగానే తీసుకెళ్ళిపోయాడు. తన హాస్పటిల్ ఖర్చులకి, తన చావుకి, మందులకి ఎవరి దగ్గర ఒక్క రూపాయి చేయి చాచకుండా సరిపడా ఉంచుకున్నారు. అందరం వెళ్ళి జరగవలసిన కార్యక్రమాలు అన్నీ చేసి వచ్చాము. ఏనాడూ పూజలు శ్రద్దగా చేయని అమ్మ నాన్న అస్తికలు కాశీలో కలిపి వచ్చింది. ఈ సంవత్సరం ఎంతో మంది తల్లితండ్రులు కరోనా కి బలైయ్యారు. చాలా మంది దిక్కు మాలిన వారి లాగా, అనాధ శవాల్లాగా ఒక కార్యం, తంతు జరగకుండా ఈ  భూమిని విడిచి వెళ్ళారు. అలంటి ఏ వార్త విన్నా, మనసులో ఒక్కటే తలంపుకి వస్తుంది. మా నాన్న ఎంత అదృష్టవంతుడు?  లేక ఆయన పూజల ఫలితామా? ఆ శివయ్య అలా గౌరవంగా తీసుకుని పోయాడా అని.....

నాగిని, ఇది నీ కోసం. అమ్మ నన్ను వెంట బెట్టుకుని పనిమాలా గుడికి తీసుకుని వెళ్ళిన  సందర్భాలు నాకు గుర్తులేవు. నాకు ఎప్పుడు వెళ్ళాలని అనిపించేది కాదు. చాలా ఏళ్ళు అసలు దేవుడు, గుడి అని నమ్మకం లేక ప్రతి గురువారం నా ఫ్రెండ్స్ బాబా గుడికి వెళ్తే, గుడి ముందు దాకా వెళ్ళి కూడా లోపలకి వెళ్ళకుండా వాళ్ళ కోసం బయట ఉండి పోయే దాన్ని. బాబా తన భక్తుల్ని ఎక్కడ ఉన్నా రప్పించుకుంటారు అంట. ఇప్పుడు బాబాని నేను నామస్మరణ చేయని రోజు ఉండదు. అలా అని ప్రపంచం లో ఏది జరిగినా, అయ్యో ఇలా ఎందుకు చేసావు దేవుడా? నాకే ఈ కష్టాలు ఎందుకు అని అస్సలు ఎప్పుడూ అనుకునే రకం కాదు. మానవ ప్రయత్నం మనం చేసి మిగతాది దేవుని మీద వదిలేయటమే అని నమ్ముతాను . ఇది ఎందుకు రాసాను అంటే మన ఇద్దరి నాస్తికత్వానికి, ఆస్తికత్వానికి కొంచెం పోలిక ఉందనిపించి :) కొంచెం పెద్దయ్యాక మాత్రం  పండగల రోజు అయితే  గుడికి నా వల్ల కాదు అని అర్ధం అయింది. నాకు గుడికి వెళ్తే, దేవుని మీద భక్తి కన్నా జనాలు వేసుకునే బట్టలు, నగలు....పీపుల్ వాచింగ్ అనే ఒక మాయరోగం ఏడ్చి చచ్చింది. ఆ రోగాన్ని పెంచి పోషించటం ఎక్కువ చేస్తాను. సో, అదన్న మాట స్టోరీ. మొత్తానికి నాలుగు ముక్కలు రాయించినందుకు, నీకు బోలెడన్ని తాంక్ యులు అన్నమాట.

అలా థెయ్సం కి అథేయిజం కి మధ్యలో పెరిగిన నేను ఇవాళ రోజున కార్తీక మాసంలో రోజు దీపం పెడదాం అనుకునే దాకా వచ్చాను.

ఇంతకీ మా నాన్న పేరు చెప్పలేదు కదూ... నాన్న పేరు శంకర్. తాత పేరు సదాశివరావు. నాన్న వాళ్ళింట్లో ఏంటో అందరికి శివుడు ఫామిలీ పేర్లే ఉంటాయి. మా పెద్దత్త పేరు భవాని, రెండో అత్త పేరు వినయ, మూడో అత్త నాగరాణి.  నాన్న ఆఖరి  దాకా తనే భోజనం  పంపేది. నాగక్కా, ఆ శివయ్య నిన్ను ఎప్పుడూ చల్లగా చూడాలని కోరుకుంటాము.  What's in a name? I really don't know.

0 comments:

Post a Comment