March 15, 2012

ఉగాది తగాదా

ముందు మాట: ఇది కొంచం పెద్ద వ్యాసమే..ఓపిక ఉన్న వాళ్ళే చదవగలరు. ఓపిక నశించిన వాళ్ళు తిట్టుకోకుండా పేజి తిప్పేయ గలరు అని మనవి..:-)
                     సంతోషంగా కొత్త సంవత్సరం మొదలు పెట్టబోతుంటే తగాదా ఎమిటనుకుంటున్నారా? కొత్త సంవత్సరం కన్నా ముందు పాత సంవత్సరాల్లో మొదలైన తగాదా గురించి చిన్న కథ. చిన్నది కాదులెండి ,  కొంచెం పెద్ద పిట్ట కథే. మా ఫోల్సొం లోయలో ఎంతో కొంత మంది భారతీయులు ఉన్నారు. సంఖ్యలు మనకి ముఖ్యం కాదులెండి. ఆ సంఖ్య తెలీని భారతీయుల్లొ, గణణీయమైన తెలుగు వారున్నారు. (నా వన్నీ సుమారు లెఖ్ఖల్లెండి....అలా అంకెలు అడగకండి).
అంటే మన ఆంధ్రులు అంటే ఇంకా బావుంటుంది అనుకోండి. అయితే ఇక్కడ ఉన్న తెలుగు వారికీ ఒక సంఘము ఉన్నది అన్నమాట. ఆ సంఘంలో ఎవరికి ఏమైందో , ఎందుకు అభిప్రాయ బేధాలు వచ్చాయో మనకి తెలీదు కానీ, అది రెండు గ్రూపులుగా చీలింది. ఇద్దరి మధ్య చలి యుద్ధం మొదలైంది. (cold war). మేము ఈ వూరికి కొంచెం కొత్త. కాబట్టి ఏ గ్రూపుకి చెందము. ఇద్దర్లో ఎవరన్నా పక్షపాతం లేదు. మా వీలును బట్టి, సమయాన్ని బట్టి, ఎవరి కార్యక్రమానికి వెళ్ళటానికి కుదిరితే దానికి వెళతాము. రెండు గ్రూపుల వాళ్ళు సంవత్సరానికి ఒక వార్షికోత్సవం పెడతారు. అది కాకుండా మధ్య మధ్యలో ఉగాది అనో, స్వాతంత్ర్య దినోత్సవం అనో, ఇక్కడ లోకల్ టాలెంట్ ని ప్రొత్సహిద్దాం అనో ఏదో ఒకటి పెట్టి మా లాంటి వాళ్ళకి వినోదం పంచుతా ఉంటారు.
                              అస్సలు మొదట ఏర్పడిన గ్రూపు వాళ్ళు (దాన్ని పేరెంట్ అని పిలుచుకుందాం కొంచెం సేపు మన సౌకర్యార్ధం) ఈ సంవత్సరం ఉగాది వేడుకలు ఘనంగా జరపాలి అని మొదట అనుకున్నారట. ఈ దిక్కు మాలిన దేశంలో పుట్టిన రోజు తో సహా పండుగలు, వేడుకలన్నీ వీకెండ్ కి వాయిదా వేయాలిసిందే కదా. అలాగే ఉగాది ఉత్సవాలు కూడా వీకెండ్ కి నెట్టేశారు. పాపం యాజమాన్యం వారు అన్ని ఈర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రోగ్రాం అజెండాని ఈమెయిలు లిస్టు లో ఉన్న వారందరికి పంపేసారు కూడా. వీరు విడుదల చేసిన వెంటనే, మన చైల్డ్ గ్రూపు వారు కూడా మరి మనమేమి తక్కువ తిన్నాం, పోటీకో, మేము ఎందుకు తగ్గాలని అనుకున్నారో లేక మా పండగ మాదే, మీ పండగ మీదే అనుకున్నారో( ఆ వివరాల చిట్టా మనకి ఎందుకులెండి), వారు విడుదల చేసారు, అజెండాని. ఇది తెలుసుకున్న మన పేరెంట్  గ్రూపు వారు తమ పెద్దరికం చూపిస్తూ వాళ్ళ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు...ప్చ్..అనుకుంటున్నారా? ఇహ మన అభిమానులు ఉండనే ఉంటారు కదా..ఒకళ్ళ తరువాత ఒకళ్ళు పొగడ్తల ఉత్తర ప్రత్యుత్తర రాయభారాలు నడపటం ప్రారంభించారు. మీరు తీసుకున్న నిర్ణయం అభినందనీయం, గోంగూర, గాడిద గుడ్డూను. కార్యక్రమం రద్దు చేసుకోటానికి అంటూ ఒక కారణం ఉంటుంది కదా. అదేమిటి చెప్మా అంటే, ఇద్దరు ఒకే రోజు ఒకే  పూట ఉగాది ఉత్సవాలు పెడితే, ఉన్న తెలుగు వారికి ఇబ్బంది, పాల్గొనే కళాకారులకి ఇబ్బంది అని. మరి అది నిజమే కదా. గ్రూపులు వేరైనా, వూరు ఒకటే కదండీ. సో, ఉన్న వారినే పంచుకోవాలి కదా, వచ్చే ప్రేక్షకులనైనా, పాల్గొనే కళాకారులనైనా.
                       కథ ఇంకా అవ్వలేదు..అప్పుడే బోర్ కొట్టేసిందా..:( సారీయే. నాకేమో అఖ్ఖర్లేని వివరాలు చెప్పటం అంటే మహా ఇష్టం. అందుకేనండి బ్లాగ్ మొదలు పెట్టింది. సరే, ఎక్కడ ఆగిపోయాం? ఆ, సమాజం లో సాటి మనిషిగా, మనకంటూ కొన్ని అభిప్రాయాలూ ఏడుస్తాయి కదా. పైగా నిద్ర లేచింది మొదలు, ఇన్బోక్సు నిండా ఇదే మెయిల్స్ గోల. మన అభిప్రాయం చెప్పక పోతే ఎలా? అలా, మన అభిప్రాయం కూడా పడేశాము అనుకోండి. కాకపోతే దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్లు కొద్దిగా ఆలస్యంగా.( ముందే పంపుదును, మనకి ఎందుకులే, వూరికి కొత్త..ఇలాంటి వాటి జోలికి పోటం అని వదిలేసా). అసలు పంపొద్దు అనుకున్నా కానీ, మనసు కోతి లాంటిది కదా. వ్రాయకుండా ఉండలేకపోయాను. చైల్డ్ గ్రూపుకి రాయలేదు అనుకునేరు. వారికి కూడా కాపీ చేశాను. కాకపోతే నేను వాళ్ళ లిస్టు లో లేకపోయే సరికి నా మేఘసందేశం చేరలేదు పాపం. ఈ లోపు ఈమెయిలు పరంపర తెగిపోయిందట. ఇంకా ఈమెయిలు రాయభారాలు చేయవద్దు అని ప్రజలు వేడుకుంటున్నారు అని మన పేరెంట్ గ్రూపు యొక్క ప్రతినిధి వారు నాకు జాబు రాసి, వారు రెండు గ్రూపులని ఒకటి చేయటానికి ప్రయత్నించిన జాబితా ఏకరువు పెట్టారు.. హ్మ్....అని ఒక పెద్ద నిట్టూర్పు విడిచి ఈ జన్మలో ఈ సమస్య పరిష్కారం కాదులే కానీ, మీరు చేసే ప్రతి పనిలో మీకు శుభం జరుగు గాక అని ఆశీర్వదించి( ఎవరి కర్మ కి వాళ్ళు చావండి అని మనసులో తిట్టుకుని), దాని గురించి ఆలోచించటం అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు అని నిర్ణయించుకుని వాట్ నెస్ట్ అని థింకింగ్ ప్రారంభించా అన్నమాట.
                     ముందే చెప్పా కదా, మనం గోపి అని.(గోడ మీద పిల్లి). తగువుల్లో తల దూర్చకుండా రాబోయే ఉగాది ఉత్సవాలకి నా పుత్ర రత్నంతో ఏదన్నా నాలుగు తెలుగు ముక్కలు పలికిద్దాం అనే భగీరథ ప్రయత్నంలో ఉన్నా ప్రస్తుతం. ఆ ప్రయత్నం గనక ఫలిస్తే మంచి హుషారుతో మళ్ళా పది రోజుల్లో మీ ముందుకు వస్తా. ఫలించక పోయిన వస్తా అనుకోండి. కాకపోతే కొంచెం నీరసంతో సుమీ. 
చివరి మాట: పై వ్యాసం లోని వ్యర్ధ పదార్ధం ఎవరినీ ఉద్దేశించినది కాదు. అందులో వ్యక్త పరచిన అభిప్రాయాలూ, భావాలూ అన్ని రచయిత అనగా నా సొంతం. 
మనలో మన మాట: నేను తెలుగులో ఏదన్నా వ్రాసి ఒక రెండు దశాబ్దాలు మాత్రమే అయ్యి ఉంటుంది. కావున, తప్పులు, తడకలు ఉంటే పెద్ద మనసుతో క్షమించగలరు.

3 comments:

  1. హహహ్.. ;)
    నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అనీ.. ః))

    మీ ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నానండీ. ముందస్తుగా ఉగాది శుభాకాంక్షలు

    ReplyDelete
    Replies
    1. @Raj Kumar..thank you :) meeku kooda ugaadi subhaakaankshalu.

      Delete
  2. nuvvu sooper akkai... emo anukuna kani nee talent ekadadiko poyindi :))

    Ugadi Subhakanshalu to all your thoti family from your thoti chelli.. <3

    ReplyDelete