March 27, 2012

ఉగాది ముగింపు

మార్చ్ 24
ఉగాది - 3

అన్ని సాధనలు అయ్యాక, అసలు రోజు రానే వచ్చింది. నా కొడుక్కన్నా నాకు ఎక్కువ టెన్షన్ మొదలైంది. ముందు రోజు రాత్రి ఏమో స్నేహితులం అంతా కలసి ఉగాది జరుపుకున్నాం. అందరం పడుకునే సరికి తెల్లవారు జామున రెండు అయ్యింది. ఇంక ప్రొద్దుటే లేవటం ఎంత కష్టమో మీకు తెలియంది కాదు. చెప్పా కదా వాడి కన్నా నాకెక్కువ టెన్షన్ గా ఉంది అని. కావున, ప్రొద్దుటే లేచి వాడిని తాయారు చేసి పదిన్నరకి వేదిక దెగ్గరకి చేరాం. అప్పటికి ఇంకా పంచాంగ శ్రవణం జరుగుతోంది. మెల్ల మెల్లగా ఒక్కోళ్ళు వస్తున్నారు.
ఒక పంతులు  గారు చదువుతా ఉన్నారు. ఒక్కరూ వినరే. ఎవరి గోలలో వాళ్ళున్నారు. మరి అనవసరంగా ఆయనకి ఖంఠ సోష ఎందుకో?
                     పంచాంగ శ్రవణం అయ్యాక, పిల్లల శ్లోకాల ఉఛ్ఛారణ మొదలైంది. ముందుగా ఏడు సంవత్సరాల  లోపు పిల్లలు చెప్పారు. తరువాత, ఎనిమిది నుండి పదకొండు సంవత్సరాల వయసు గల వారి అవకాశం. అసలే ఓపిక తక్కువ మా వాడికి. ఒక పిల్లాడు లింగాష్టకం చెప్పాడు. అంతే ఇహ వీడికి టెన్షన్. నా దెగ్గరకి పరిగేట్టుకొచ్చి "అమ్మ, ఎలాగా?" అంటాడు. ఎలాగా ఏముందిరా? ఎవరు బాగా చెబితే వాళ్ళకే ఇస్తారు ప్రైజ్ అని వాడికి సర్ది చెప్పి పంపా.
               అదేమిటో అందరు లింగాష్టకమే పాడుతున్నారు. శివుడు మీద అందరికీ ఇలా భక్తి పొంగి పొర్లుతుంది ఏమిటా అని ఒకరిద్దరు తల్లి తండ్రులు వాపోయారు.(వాళ్ళ పిల్లలు కూడా అదే పాడబోతున్నారు కాబోలు). వీడికేమో అసహనం పెరిగిపోతుంది ఇక్కడ. ఇంక లాభం లేదులే, స్టేజి దెగ్గర ఉన్న ఆవిడని అడుగుదాం వీడి పేరు ఎప్పుడు పిలుస్తారో అని వెళ్ళి అడిగితే ఆవిడ లిస్టు చూపించారు. పేర్ల అక్షరాల క్రమంలో పిలుస్తున్నారు. మరి రుషిక్ అని పేరు పెట్టినప్పుడు కలగన్నామా? ఇలా వాడు పాల్గొంటాడు, ఆఖరున పిలుస్తారు అని?
                          స్టేజి దెగ్గర నుంచునే సరికి, ఇంకా వాడి పేరు పిలవటానికి కొద్ది సమయం మిగిలి ఉందనగా, అప్పుడు శ్లోకం చివరన ఉన్న నాలుగు వాఖ్యాలు నేర్పమంటాడే. పర్లేదులే నాన్న వదిలేయ్ అంటే, అహా, నాకు తెలీదు, చెప్పు అని ఏడుపు. ఓరి దేవుడా, ఇప్పుడు అన్నీ మర్చిపోతావు అని నచ్చ పుచ్చుతుంటె లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లు, ఆఖరి వాడి ముందు పిలిచారు. మెల్లగా మొదలెట్టాడు అబ్బాయి గారి గానం. వాడికి ఇంట్లో చెప్పినా గుర్తు లేదు. మైక్ ని  దూరంగా పెట్టుకోరా అని. (అసలు ఆ మాట చెవికి ఎక్కించుకుంటే కదా గుర్తుంచుకోటానికి). మైక్ ని మింగేసేలా దాదాపు నోట్లో పెట్టేసుకుని, వణుకుతూ చెబుతున్నాడు. పాపం వాడి కళ్ళు బెదిరి పోయి, మర్చిపోయినప్పుడల్లా అలవాటు ప్రకారం నా వైపు చూడటం, నేనేమో ఆ పదం అందించటం వాడు ముగించటం అన్నీ మూడు నిమిషాల్లో అయ్యిపోయాయి.
                        హమ్మయ్యా...అని ఊపిరి పీల్చుకున్నా. వాడికేమో లోపల్లోపల బాగా చెప్పలేదు అని ఉంది. వాడి ఐడియాలజీ ప్రకారం వాడే బాగా చెప్పాలి, ఇంకా ఎవరూ వాడి కన్నా బాగా చెప్పకూడదు అని గొప్ప కోరిక. ఆ వయస్సు పిల్లల ఆలోచన అంతే ఉంటుంది ఏమో.
                ఆ తరువాత పిల్లలకి ఫాన్సీ డ్రెస్, భోజనాలు ఒక పక్క నడిచాయి. పంక్తి భోజనాలు పెట్టారు. బొబ్బట్లు,  పూత రేకులు, ఉలవచారు ప్రత్యేక వంటలట. భోజనాల్లో నాకు నచ్చింది ఖిళ్ళీ. తిని చాలా రోజులైంది. వాళ్ళు ఏమి పెట్టారో ఏమి తిన్నానో నాకే తేలీదు. నిన్న వేరే పని ఉండటం చేత మా వారికి రావటానికి కుదరలేదు.  మా ఇద్దరి కోతులతో కిష్కిందకాండ నాకు. భోజనాలు అయ్యాక, పిల్లల సాంస్కృతిక సంగీతం, వక్త్రుత్వ పోటీలు జరిగాయి. ఈ రెండు కార్యక్రమాలు బావున్నాయి. కొంత మంది పిల్లకాయలు తెలుగుని అచ్చమైన ఆంగ్ల యాసతో చక్కగా చెప్పారు. వారు ఎలా చెప్పినా వారు చేసిన ప్రయత్నం అభినందనీయం.
                          ఒక బుడ్డి గాడు మటుకు చిన్నప్పుడెప్పుడో విన్న కూరగాయల కథ చెప్పాడు.(ఉసిరి కాయ అంత వూరిలో, ఈత కాయ అంత ఇంట్లో బాదం కాయ అంత బామ్మ ఉందట....) హహ్హహ్హహ్హ ......గుర్తుకొచ్చిందా మీకు కూడా? పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుని ఇంటికి చేరాం.
ప్రాంగణం అంతా సంప్రదాయ రీతిలో అలంకరించారు. మామిడి తోరణాలు కట్టి, న్యూ యార్క్ నుండి మల్లె పూలు తెప్పించారట. ఇలాంటి కార్యక్రమాలకి వెళ్లి రావటం, వాటి గురించి అభిప్రాయాలు వెలిబుచ్చటం చాలా తేలిక. వాటికి ఈర్పాట్లు చేయటం, సమయం వెచ్చించటం, తపన పడటం అందరూ చేయలేరు.
                ఇంకా కూడా ఏవో ఆటల పోటీలు అవీ ఉన్నాయ్ అన్నారు కాని ఉండే ఓపిక లేక ఇంటి ముఖం పట్టాము.
కార్యక్రమం మొత్తానికి చిర్రెత్తుకొచ్చింది ఏంటంటే,  ఆ బుడ్డి బుడ్డి పిల్లలు అంత కష్ట పడి నేర్చుకుని పాడుతుంటే, ఒక్కళ్ళు చప్పట్లు కొట్టరే? ఏమి చేతులు అరిగి పోతాయా? కొట్టక పోతే పోయారు, కనీసం నిశ్శబ్దంగా అన్నా ఉండరే? నిర్వాహకులు ఎన్ని సార్లు చెప్పారో...దయ చేసి నిశ్శబ్దం పాటించండి. న్యాయ నిర్ణేతలకి వినిపించటల్లేదు అని మొత్తుకున్నా....అహా...ఎవడి గోల వాడిదే....చెవులు దొబ్బుంటాయి ఒక్కోళ్ళకి..అంతగా ఏముంటాయో కబుర్లు?  అంతలా మాట్లాడేది ఉంటే బయటకి పోవొచ్చుగా. ఇలాంటి వాటికి రావటం దేనికి, అందరికి ఇబ్బంది కలిగించటం దేనికి?
             వూరికే పట్టు చీరలు కట్టుకుని, ధగ ధగ మెరిసే నగలు పెట్టుకుని వస్తే సరిపోతుందా? ఇంకోటండి...ఎవరెవరి పిల్లలు పాడినప్పుడే, వారు వేదిక దెగ్గరకి వెళ్ళటం, వాళ్ళని నాలుగు ఫోటోలు తీసుకుని, వీడియో తీసుకుని, చప్పట్లు చరిసేసి ఇంక వాగుడు ప్రారంభించటం. మిగతా పిల్లలు పిల్లలు కారా? ఇంతోటి ఉపన్యాసం ఇస్తున్నావు? ఏమి నువ్వు అసలు మాట్లాడవా ఇలాంటి కార్యక్రమాల్లో అని అనుమానం రావొచ్చు. నిజంగానే నేను మాట్లాడను. వీలు ఐన అంత తక్కువ మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. సొంత డబ్బా కాదు సుమీ.
                             మా ఫోల్సోం వాసులకి ఇలాంటి బ్లాగ్ ఒకటి ఉందని, దానిలో నా లాంటి తలతిక్క వాళ్ళు రాస్తారని తెలీదు. కావున, ఎవరైనా ఆ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు ఇది చదివి ఉంటే, మీరు గనక మాట్లాడి ఉంటే, భవిష్యత్తులో నిశ్శబ్దం పాటించవలెనని కోరుతున్నాను.
కొసమెరుపు : మధ్యాహ్నం నుండి స్టేజి మీద యాంకరింగ్ చేసే ఆవిడ మల్లీ (మళ్లీ) అనే పదాన్ని మల్లీ మల్లీ వాడతా ఉన్నారు. ఇంతలోకి నా కూతురు అమ్మా," అమ్మాయి మల్లీ మల్లీ అంది అమ్మా" అన్నది.(దానికి 'ళ'  పలకదులెండి). అంతే నాకు షాక్ ఒక్కసారే. ఇంట్లో మా బాబుని మల్లీ అన్నప్పుడల్లా మళ్లీ అని సరిదిద్దుతా ఉంటా. అది గుర్తు పెట్టుకున్నది కాబోలు. అలా తెలుగులో ఉగాది ఉత్సవాలు ముగిసాయి.
                                అందరికీ ఇవే నా నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!!       

4 comments:

  1. Telugu meeda mee abhimananiki na joharlu!!

    ReplyDelete
  2. @Haritha..thanks Pilla...didn't know you had a blog..eppudu cheppaneledu ..:)

    ReplyDelete
  3. kevvvvvvv.... బాగా మంటెక్కి పోయినట్టున్నారండీ.. పోనీలెండీ మీకూ,బాబుకీ పెద్ద టెన్షన్ వదిలిపోయిందిగా..
    [చాలా లేట్ గా చదువుతున్నా కదూ.. రెండు వారాలు ఇంటికి ట్రిప్ లెండీ. ఒక్కొక్కటీ ఈరోజే చూస్తున్నా]

    ReplyDelete
    Replies
    1. @Raj kumar...haha....enduku anta mata anesaaru? mari ekkuva tittesana janalani? nenu mee comment kosame vechi unna...:)nenu swadesi yaanam lo unna...net access ledu..sorry for the delay in publishing your comment.

      Delete