April 4, 2020

1.ఖమ్మంలోని కమ్మటి రోజులు....కస్బా బజార్, ఫాస్ట్ కిరాణా, సమోసె .....

నేను తెలిసిన చాలా మందికి నేను ఖమ్మంలో కొంత కాలం పెరిగాను అన్న విషయం కూడా తెలుసు. 89 - 94. I would say the most beautiful years of my childhood. ఖమ్మం వచ్చిన కొత్తలో కస్బా బజార్ లోని  ఫాస్ట్ కిరాణా షాప్ పైన ఒక చిన్న పోర్షన్లో అద్దెకి ఉండే వాళ్ళము. ఆ బిల్డింగ్ ఓనర్ ఖాన్ సాబ్. ఖాన్ అంకుల్ వాళ్ళది పెద్ద కుటుంబం. ఆయనకి ఇద్దరు కూతుర్లు, నలుగురు కొడుకులు. అందరి పేర్లు గుర్తు లేవు కానీ, వసీం, సోహాబ్, సుహైల్ అనుకుంట ఒక ముగ్గురు పేర్లు. మూడో వాడు మాతో ఆడుకునే వాడు. ఆఖరి వాడు అందరి కన్నా చిన్నోడు. నేను మొదట ఇద్దరు అబ్బాయిలతో ఆడే దాన్ని. మనకి ఎప్పుడు మన కన్నా పెద్ద వాళ్ళతోనే కదా సావాసం. నేను మొట్ట మొదటి సారి గాలి పటాలు ఎగురవేసింది ఖాన్ గారి డాబా మీదనే. నేను ఎగురవేశా అనే కంటే, వాళ్ళకి స్టెఫనీగా ఉండే దాన్ని అంటం బెటర్ ఏమో. పక్కన డాబాల మీద పటాలని పడేస్తే, అబ్బా...ఆ ఆనందం అంతా ఇంతా కాదు.
         ఫాస్ట్ కిరాణా అంకుల్ అప్పటికే సౌదీలోనో, దుబాయ్ లోనో ఉండి వచ్చారు. ఆయన తో మంచి స్నేహం కుదిరింది. అందులో మా వి.వి.సి లో చదివే పిల్లకాయలు కొద్దిగా ఇంగిలి పీసు ఇరగదీసేవారు అని టాక్ అఫ్ ది టౌన్ లెండి. సో, అంకుల్ తో మనం ఇంగ్లీషులో రెచ్చి పోయేవాళ్ళం అన్నమాట. అప్పట్లో  స్టాంప్ కలెక్షన్ ఒక పెద్ద హాబీగా ఉండేది. మనకి ఎవరు ఉన్నారు ఫారిన్లో, స్టాంపులు ఇవ్వటానికి? ఎలానో మొదలు పెట్టాను నేను కూడా అందరి లాగానే. మొదటి స్టాంపు ఎవరు ఇచ్చారో కూడా గుర్తు లేదు నాకు. అలా అంకుల్ తో స్నేహం పెంచుకుని, మెల్లగా అయన స్టాంప్ కలెక్షన్ మీద ఒక కన్నేసి, ఆయన్ని బతిమలాడి, కొన్ని కొట్టేసి, మన కలెక్షన్ పెంచేసుకుని, కొత్తగా చేరిన స్కూల్లో కొంచెం పాపులారిటీ పెంచుకున్నాను అన్నమాట. అసలు ఆయనతో ఫ్రెండ్ షిప్ చేసిందే అందుకు అనుకోండి. కానీ వేసవి సెలవుల్లో ఎవడో ఒకడు నా పుస్తకం చూసి ఇస్తా, స్టాంప్స్ ఎక్స్చేంజి చేసుకుందాం ఇలాంటి కహాని ఎదో చెప్పి మొత్తానికి నా కష్టార్జితాన్ని కాజేసాడు. చాల ఏళ్ళు వాడి పేరు గుర్తు పెట్టుకున్నా. ఇప్పుడు మర్చిపోయా. వాడెవడో గుర్తొస్తే  మాత్రం, నా చేతిలో చచ్చాడే. 
                 కొత్తలో డాబా పైన నుంచుని రోడ్ మీద అమ్మే వాళ్ళని, వచ్చి పోయే బళ్ళని చూస్తూ ఉంటే, చాలా సందడిగా ఉండేది. అమ్మ ది వరల్డ్ ఫేమస్ నాజ్ టైలర్ దెగ్గర నేర్చుకోటానికి వెళ్ళేది. మీకు నాజ్ టైలర్ తెలీకపోతే, మీది ఖమ్మం కాదండోయ్. తను వచ్చే దాకా, మనం బేవార్స్. అలా ఒక రోజు సమోసా అమ్మే అతను వెళ్తూ, సమోసె , సమోసె అంటే ఆ వింత పదార్థం ఏమిటో అర్ధం కాలేదు. ఫస్ట్ ఫ్లోర్ నుండి రోడ్ అవతల మనిషి తల మీద బుట్టలో వున్నవి ఎలా కనిపిస్తాయి చెప్పండి? అందులోనూ మనకి సోడా బుడ్డి కళ్ళద్దాలు. అవును మరి, మా ఆంధ్ర దేశంలో ఎప్పుడు చూడలేదు నేను వాటిని.  ఓహ్, ఖమ్మంలో వీటిని సమోసా అంటారు కాబోలు, అవి ఖఛ్చితంగా కజ్జికాయలు అని మన సొంత పరిజ్ఞానంతో ఫిక్స్ అయ్యిపోయా. తరువాత  మా అమ్మ బుర్ర తినీ తినీ ఎప్పుడో అవి తిన్నాకా కానీ, ఆత్మకి శాంతి చేకూరలేదు.
ఇప్పటి దాకా చదివారంటే, నా సోది ఇంకా చదువుతారు అని నమ్మకం తో, మళ్ళా వస్తా....అప్పటి దాకా, మీరు మీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుని చెప్పరూ ....

1 comment:

  1. చక్కని పోస్ట్ అండ్ తీపి జ్ఞాపకాలు పృథ్వి. నేను కూడా అలా చిన్నప్పటి రోజులు కి వెళ్లి వచ కాసేపు. 😊

    ReplyDelete