April 6, 2020

2.ఖమ్మంలో కమ్మటి రోజులు... మాంసం, మండి, గోపి వాళ్ళ ఇల్లు...

ఖాన్ గారి డాబా మీద ఏవో తోళ్ళు లాంటివి వేళ్ళాడేసే వాళ్ళు. ఏదో మాంసం. ఎర్రగా, పొడుగ్గా, వేలాడుతూ ఉండేవి. వాటికి ఉప్పు, కారం పట్టించి ఉండేవి. వాళ్ళ పిల్లలతో ఆడుతూ, అవి ఎండాయి అనుకుంటే, వాళ్ళతో పాటు మేము చిన్న ముక్కలు చించుకుని తింటా ఉండే వాళ్ళం. వాళ్ళ అక్కలు అప్పుడప్పుడూ చెకింగ్ కి వస్తే మాత్రం అందరం ఒక ముఠా అయ్యిపోయే వాళ్ళం. చికెన్ అయితే కాదు. నాకు చికెన్ కి, మటన్ కి తేడా అమెరికా వచ్చి, సొంతగా వంటలు చేసే దాకా  తెలీదు.  అమెరికాలో దుకాణాల్లో బీఫ్ జెర్కి చూసినప్పుడల్లా నాకు అవే గుర్తొస్తాయి. 
                    మేము ఉంటున్న బిల్డింగుకి ఎదురుగా ఒక బాగ్ రిపేర్ షాపు ఉండేది. ఆ షాపో, పక్క షాపులో నుండో ఎప్పుడూ  మైనే ప్యార్ కియా,  జెగదేక వీరుడు అతిలోక సుందరి పాటలు వస్తూ ఉండేవి. 89లో నన్ను అలరించిన రెండు పాటలు: కాబూతర్ జా జా...అబ్బనీ తీయని దెబ్బ...అవి వినటానికి కాబోలు, ఇంటి ముందున్న రెండు అడుగుల క్యారిడార్లో నుంచుని వేలాడే వాళ్ళం. ఎందుకో, ఎలానో తెలీదు కానీ ఆ షాప్ లో అన్న తో పరిచయం అయింది. ఒకసారి పెద్ద మిక్కీ మౌస్ కార్డ్ బోర్డ్ మీద వేయించుకున్నా ఆ అన్నతో. ముక్కు మొహం తెలీని వాళ్ళతో ఫ్రెండ్ షిప్ ఏంటి అని తిట్లు కూడా పడ్డట్టు గుర్తు. 
                            మొదటి అంతస్థు మెట్లు ఎక్కిన వెంటనే, కుడి వైపుకి ఫాస్ట్ కిరాణా గోడౌన్ ఉండేది. సరుకులు పాకింగ్ అంతా అక్కడే జరిగేది. అక్కడే మనం స్టాంప్ బుక్కులో ఏమేమి నొక్కేయాలో ప్లాను వేసింది. మధ్యలో ఖాన్ గారి కుటుంబం ఉండేది. చివరికి ఉన్న రెండు గదుల వాటాలో మేము ఉండే వాళ్ళం. మెట్లు ఎక్కిన వెంటనే, ఎడమ వైపు పిట్ట గోడ దెగ్గర నుంచుంటే, కింద మండీ కనిపించేది. ఇంక ఎండా కాలం మండీలో మామిడి పళ్ళు, గుట్టలు గుట్టలు.. అసలు ఆ ముచ్చట చెప్పలేనిది. వందల్లో కాయాలు. అవి మిగల పండిపోయి, కుళ్ళి పడేస్తుంటే, లోపల నుండి వచ్చేది బాధ...వర్ణనాతీతం. లారీ నిండా పళ్ళు గుమ్మరిస్తుంటే, పసుపు పచ్చని దుప్పటి పరిచినట్టు, నాకు అంత పొయెటిక్ గా చెప్పటం రాదు. దీనితో ఊహించేసుకోండి ఎంత అందంగా ఉండేదో...
                 మా ఇంటికి స్కూల్ బస్  స్టాప్ పది నిమిషాల నడక. బస్సు పొతే మళ్ళా స్కూల్లో దింపే వాళ్ళు ఉండరు. ఎందుకంటే మా స్కూల్ ఊరి అవతల ఎక్కడో. అందుకని, చచ్చినట్టు టైంకి రెడీ అయ్యిపోయే వాళ్ళం. మెట్రో హోటల్ని ఆనుకుని మా హౌస్ క్యాప్టెన్ గోపి ఇల్లు. తను ఎప్పుడో టెన్త్ లో క్యాప్టెన్ అయ్యాడు కానీ, నేను ఇప్పటికీ క్యాప్టెన్ అనే పిలుస్తా. జెమ్ ఆఫ్ ఎ  గై. నీతో ఎప్పుడూ అనలేదు కానీ, నీ లాంటి వాళ్ళు ఇవాళ రేపు చాలా అరుదు అబ్బాయ్ ...గోపి ఇంటి ముందర బస్సు వచ్చే దాకా, అందరు ఆటలు. గోపి తెలిస్తే, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లి, వాళ్ళ నాయనమ్మ కూడా తెలియాలిసిందే అందరికి. ఎందుకంటే, మేము బస్సు స్టాప్ లో కన్నా, వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఆడే వాళ్ళం. ఇంట్లోకి బయటకి ఎన్ని సార్లు పరిగెత్తినా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమీ అనేవారు కాదు. అందరి పేరెంట్స్ అంత  చిల్ గా  ఎందుకు ఉండరో?  మా ఇల్లు వాళ్ళ ఇంటికి దగ్గర కాబట్టి, వేసవి సెలవుల్లో, ఇంకొంచెం ఎక్కువ సార్లు ఆడుకునే వాళ్ళం. 
                  అబ్బా....ఒక్కసారి వెనక్కి వెళ్ళి టైం అలా ఆగిపోతే ఎంత బావుణ్ణు ?

0 comments:

Post a Comment